విజన్ 2020 అని మనం కొన్ని సంవత్సరాల నుంచి కలలు కన్నాం. కానీ కల చెదిరింది. మన విజన్ ని పూర్తిగా మార్చేసింది 2020. రేపటి గురించి ఆలోచించమని మనకి గుర్తు చేసింది. కరోనా ఎలా బ్రతకాలో నేర్పిస్తే…ఈ ఏడాది కాలుష్య భూతం ఎలా బ్రతకకూడదో మానవాళికి పాఠం నేర్పింది. అసలు కరోనాకు వాయు కాలుష్యం తోడవడం గురించి ప్రపంచవ్యాప్త ఆందోలనలు మొదలయ్యాయి. ప్రధానంగా భారత్ లోని ఉత్తరాది రాష్ర్టాల్లో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు.

వాయు కాలుష్య సమస్య ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడి ప్రజల శ్వాసకోశాలు తెలియకుండానే ముంపు భారిన పడతాయి. ఈ వ్యాధి పీడితులకు కరోనా వైరస్‌ సోకితే అది అత్యంత ప్రమాదంగా మారుతుంది. మీకో తెలుసో…లేదో… ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటి. తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌ సంస్థ నిర్వహించిన పరిశోధన ఒక విషయాన్ని వెల్లడించింది. చలికాలంలో శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రులకు వచ్చే చిన్న పిల్లల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని పరిశోధనల్లో తేలిందట.

మన దేశంలోని అన్ని రాష్ర్టాల్లో వాయు కాలుష్యం పరిమితిని దాటి దూసుకుపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ హెచ్ ఓ ప్రమాణాల కంటే ఎన్నో రెట్లు హీనంగా ఉన్నట్లు ప్రపంచ ప్రఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్‌… 2017లో తన పరిశోధన పత్రంలో ప్రకటించింది. ఆ పత్రం ప్రకారం.. భారతదేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే 12.5 లక్షలమంది వాయు కాలుష్యానికి బలయ్యారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కాలుష్య మరణాలు అత్యధికమని తెలియజేసింది. చికాగో యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారతీయ పౌరుని సగటు ఆయుర్దాయం కాలుష్యం కోరల్లో చిక్కడం వలన నాలుగేళ్లు తగ్గిపోతుంది. కేవలం ఊపిరితిత్తుల సమస్యలే కాదు గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది కాలుష్యం. 2020 అక్టోబర్‌ నెలలో అమెరికాలోని హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం 2019లో వాయు కాలుష్య మృతుల సంఖ్య 17లక్షలకు చేరుకుంది.

2020 నవంబర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ప్యారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోలేకపోయిన ప్రపంచ పది నగరాల్లో భారత్ లోనే తొమ్మిది ఉన్నాయని తెలిపింది. దీనిని బట్టి తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గాలి, నీరు, శబ్ద కాలుష్యాల్లో భారతదేశానిది అత్యంత విషమ పరిస్థితి. ఇటీవలికాలంలో చైనా ప్రభుత్వం పాటిస్తున్న కాలుష్య నివారణ చర్యల వలన కాలుష్య తీవ్రత 30 శాతానికి తగ్గింది. ఒకప్పుడు ఢిల్లీ కంటే దిగజారిన బీజింగ్‌, మెక్సికో నగరాలు ఇప్పుడు కాలుష్యాన్ని చాలావరకు జయించాయి.

మన దేశంలో మొత్తం వాయు కాలుష్యంలో పారిశ్రామిక కాలుష్యం వాటా 51శాతం, వాహన కాలుష్యం 27శాతం , వ్యవసాయ వ్యర్థాల దహనం 17శాతం ఉండగా ఐదు శాతం బాణసంచా కాల్చడం లాంటివి ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాబితా ప్రకారమే 65 రకాల ప్రమాదకర, అతి ప్రమాదకర పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు విడుదల చేసే రసాయన, వాయు, నీటి కాలుష్యాల వలన వ్యవసాయ భూమి పనికిరాకుండా పోతుంది. ఐఎల్‌ఓ అంచనా ప్రకారం..ప్రతి సంవత్సరం వృత్తి సంబంధిత వ్యాధుల కారణంగా 4.5 లక్షల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

మన తెలుగు రాష్ట్రాల పరిస్థితినే చూసుకుంటే…అతి ఎండ, భారీ వర్షాలు, అంతుపట్టని రోగాలు. 2020లో లాక్ డౌన్ కారణంగా కాలుష్యంలో మార్పులు చూస్తే…మనిషి ఎంత జాగ్రత్తగా నడుచుకుంటే పర్యావరణానికి అంత మేలని స్పష్టమవుతుంది. హైదరాబాద్ లో ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితమైన కాలుష్యం… ప్రస్తుతం నగరం అంతటా విస్తరించింది. గాలి, నీరు, భూమి, భూగర్భ జలాలు కాలుష్యమయంగా మారుతున్నాయి. సిటీలో ధ్వని, నీరు, భూమి కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడానికి గల కారణాల్లో వాయు కాలుష్యం పాత్రే ఎక్కువ. అయినా దానిని పట్టించుకునే నాథుడు లేడు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా 117 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో పాటూ ఇంతకుముందు ఇచ్చిన నిధులనూ కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయడంపై ఖర్చు పెట్టారు తప్పితే, కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, ఆలోచనలపై దృష్టి పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం.

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ వలన జరిగిన అపార నష్టాన్ని చవిచూసాం. అది నేరుగా ఒకేసారి లీక్ కావడం వలన బయటి ప్రపంచానికి తీవ్రత తెలిసింది. కానీ ప్రతిరోజూ అలాంటి వేల పరిశ్రమల వలన నెమ్మదిగా విడుదలవుతున్న కాలుష్య కారకాలు మనషి మనుగడకు అంతే నెమ్మదిగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మొన్నటికిమొన్న ఏలూరు ప్రాంత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతు చిక్కని రోగమేదో సామాన్య జనంపై విరుచుకుపడింది. చివరికి పరిశ్రమల వ్యర్ధాలు కలిసిన నీటి కాలుష్యమే దీనికి కారణమని సమాధానమిచ్చి చేతులు దులుపుకున్నారు.

Andhra Pradesh: Gas leak in Vizag kills 11, including child, many  hospitalised

నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కాలుష్యం ప్రమాదకర స్థాయి మించిందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం తర్వాత ఆ స్థాయి పరిశ్రమలు నెల్లూరుకు క్యూ కడుతున్నాయి. సముద్ర తీరంలో కేవలం 13 కిలోమీటర్ల పరిధిలోనే 27 థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమలను నిర్మిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే ఉత్పత్తినందిస్తున్నాయి. ఆ పరిశ్రమల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి పంటల దిగుబడి 30 శాతం తగ్గుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చేపల పరిశ్రమ కుదేలవుతుంది. థర్మల్‌ కేంద్రాల వేడి వల్ల సముద్రంలోని వేల టన్నుల రొయ్యలు, చేపలు మృతి చెంది మత్స్యకారులు ఒక్కొక్కరుగా ఉపాధి కోల్పోతున్నారు.

గతంలో అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఎండకే అల్లాడిపోయిన ప్రజలు…ఇప్పుడు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను చవిచూడాల్సి వస్తుంది. దీనికితోడు ఫ్రిజ్‌లు, ఏసీల వాడకం పెరగడంతో క్లోరోఫ్లోరో కార్బన్‌లు వెలువడి ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కారణంగా పరిశ్రమలు మూతపడటం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహన రద్దీ తగ్గడంతో వాయు కాలుష్యం కొంత వరకు తగ్గిందని, కానీ భవిష్యత్తులో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

భారత ప్రభుత్వం 1981లోనే వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాతా అనేక కాలుష్య సంబంధిత చట్టాలు వచ్చాయి. ఎన్ని చట్టాలు చేసినా కాలుష్యం తగ్గిన దాఖలాలు కనిపించటం లేదు. పైగా 2020 పర్యావరణ పనితీరు సూచికలో ప్రపంచంలోని 180 దేశాలలో భారతదేశం 168వ స్థానంలో ఉందంటే భారత ప్రజలది తప్పా…ప్రజలని, పరిశ్రమలని నియంత్రించని ప్రభుత్వాలది తప్పా?

మన పర్యావరణ చట్టాల పనితీరు అతి పేలవంగా ఉంటుంది కాబట్టే పర్యావరణం మీద కాలుష్యం పంజా విసురుతుంది. చిత్తశుద్ధి లేని పాలకులు ప్రజలని కమర్షియలైజ్ చేసే పనిలోనే ఉన్నారు కానీ అవగాహన కల్పించడంలో వెనుకబడ్డారు. అవినీతి, బంధుప్రీతి వీరిని ఎంతకి విడువడపోవడం మరో కారణం. కాలుష్య నియంత్రణ అనుకున్న స్థాయిలో ఉండాలంటే.. ప్రభుత్వ జోక్యం లేని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. ఈ చర్యలన్నీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు వస్తాయి.

ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ప్రజల్లో మొక్కల గురించి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సెలెబ్రిటీలు ఫోటోలకి ఫోజులిచ్చి..యూట్యూబ్ ఛానళ్లకి మంచి ఫీడ్ ని ఇస్తున్నారే కానీ పెద్ద లాభదాయకంగా ఏమిలేదు. రామెజీ ఫిల్మ్ సిటీలో మొక్కని నాటి ఫోటోలు దిగితే ఎవరికి ఏం ఒరుగుతుంది? మనం పెంచే ఒక చెట్టు వంద మందికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. దీనికి అనుగుణంగా ప్రతి పరిశ్రమకు కేటాయించే 100 ఎకరాల్లో 30 ఎకరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలి. అయితే ఈ గ్రీన్‌బెల్ట్‌ నిబంధనను ఏ పరిశ్రమా అమలు చేస్తున్న దాఖలాల్లేవు. ఈ నిబంధనలు సరిగ్గా పాటించేలా చూసుకోవాలి.

రహదారుల విస్తరణలో చెట్లను నరికివేయడం ఆ తర్వాత ఆ రహదారి వెంట మొక్కలు నాటకపోవడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు వారి ఇంటి ముందు కనీసం ఒక మొక్క అయినా నాటి సంరక్షించాలి.. అవే మనల్ని కాపాడుతాయి. అయితే ఈ కాంక్రీట్ జంగిల్ నగరాల్లో అది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నగానే మిగిలింది. ఇబ్బడిముబ్బడిగా భవనాలకు అనుమతినిచ్చేయడం, వారు చెట్లకు భూమిని కేటాయిస్తున్నారా లేదా అని చూసుకోకపోవడం భవిష్యత్తును అంధకారంలో పడేస్తుంది. మెట్రో రైలు… కాలుష్య కారక వాహనాలను తగ్గిస్తుందని ఆశించినా, దాని నిర్మాణ పద్ధతి, ఖర్చు, ఇతర అంశాల వల్ల అది ఎవరికీ పెద్దగా ఉపయోగపడని వ్యవస్థగా మారింది. టికెట్ ధర వల్ల ధనికులు ప్రయాణించే వ్యవస్థగా మారింది. సొంత వెహికిల్ ఉంటే మెట్రోలో వెళ్లడానికి ఆసక్తి చూపించట్లేదు. పేదలు డబ్బుకు భయపడి మెట్రో ఎక్కే సాహసం చేయట్లేదు.

కాలుష్యం మానవాళి మనుగడకే గొడ్డలిపెట్టు. ప్రభుత్వాలదే కాదు బాధ్యత మనందరిది. జనాభా ఎక్కువున్న మనదేశంలో ఎలాంటి చర్య అయినా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి కాలుష్య కట్టడికి ప్రధానంగా శుద్ధిచేసిన ఇంధనాలను వాడాలి. ప్లాస్టిక్‌, వాహనాల వినియోగం తగ్గించాలి. చెట్లను పెంచాలి. ప్రజలు శుచి, శుభ్రతను పాటించాలి. కాలుష్యం మీద శాస్త్రీయ అవగాహన పెంచుకుని…దాని బారినుంచి బయటపడేందుకు తగిన మార్గాలు అన్వేషించాలి. ‘సామూహిక’రవాణా వ్యవస్థలకు శ్రీకారం చుట్టాలి.

విద్యుత్ వాహనాలు ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటి వలన స్థానిక వాతావరణంలో కాలుష్యమే కాదు ధ్వనికాలుష్యం కూడా తగ్గుతుంది. అయితే విద్యుత్ వాహనాల ధర ఎక్కువుండటం, కావల్సిన చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం ప్రధాన సమస్యలు. పెట్రోల్ పంపుల మాదిరిగా చార్జింగ్ స్టేషన్లు కూడా ఉంటే విద్యుత్ వాహనాలకు ఉపయోగం. నడకను, పాదచారులను ప్రోత్సహించాలంటే మౌలిక వసతుల డిజైన్ లో మార్పులు రావాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *