కరోనాతో ఢీలాపడ్డ సినీపరిశ్రమ ప్రస్తుతం తెగ సందడి చేస్తోంది. గతేడాది వాయిదాపడ్డ సినిమాలతో పాటూ ఈ ఏడాది రీలీజ్ కి రెడీ అవుతోన్న సినిమాలు కలుపుకొని టాలీవుడ్ జోరు చూపిస్తోంది. వరుసపెట్టి విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సంవత్సరం బడా హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒకే నెలలో నువ్వా నేనా అనుకునేలా పోటీపడుతున్నారు టాలీవుడ్ హీరోలు.
ఏప్రిల్ నెల గురించి తెలిసిందే ఏప్రిల్ 16న నాగచైతన్య, నానిల మధ్య క్లాష్ ఏర్పడుతోంది. ఒక నెల మాత్రమే కాదు ఒకే రోజు వీళ్లిద్దరి లవ్ స్టోరీ, టక్ జగదీష్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక మే నెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఒక్క నెలలో చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ సినిమాలు వరుసబెట్టి రిలీజ్ కాబోతున్నాయి. మే 13న చిరూ ‘ఆచార్య’, మే 14న వెంకీ ‘నారప్ప’ వస్తుండగా మే 28న ‘బాలయ్య, బోయపాటి’ కాంబో మూవీతో పాటూ రవితేజ ‘ఖిలాడి’ కూడా బరిలోకి దిగుతోంది. ఆలా బడా హీరోలు ఒకే టైంలో రంగంలో దిగుతున్న ఘట్టం కేవలం 90ల్లో కనిపించేది. మళ్లీ ఇనాళ్లకి ఈ ఫీట్ రిపీట్ కానుంది.
చిరూ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ రిలీజ్ టైంలోనూ గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంతో పోటీకొచ్చారు బాలకృష్ణ. కాకపోతే ఈసారి వీళ్లిద్దరి చిత్రాలకు రెండు వారాల తేడా వచ్చి ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ నిచ్చింది. కాకపోతే ఆచార్య వచ్చిన ఒక్కరోజు తేడాతోనే నారప్ప విడుదలవుతోంది. అలానే రవితేజ ఖిలాడీ, బాలకృష్ణ సినిమా ఒకేరోజు ఢీకొట్టబోతున్నాయి. దీంతో కలెక్షన్లు తేడా కొట్టే అవకాశమూ లేకపోలేదు. అందుకే ఏప్రిల్ లో నాగచైతన్యను ముందుంచి నాని, చిరూతో పోటీకి వెంకీ, బాలయ్యతో ఎదురులేకుండా రవితేజ తగ్గొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. మరి నిజంగానే తగ్గుతారా…లేదూ సై అంటే సై అంటారా….అలా అనుకుంటే సినీపోరులో గెలుపెవరిది అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *