ఫిబ్రవరి 12న ప్రేక్షకుల హృదయాల్లో ప్రేమ ఉప్పొంగేలా చేసేందుకు దూసుకొస్తుంది ఉప్పెన చిత్రం. దేవీశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారిపోయాయి. రీసెంట్ గా రిలీజైన ఉప్పెన ట్రైలర్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచింది. హీరో హీరోయిన్…వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి ప్రేమతో ఆకట్టుకుంటే…విలన్ విజయ్ సేతుపతి ద్వేషంతో భయపెట్టారు. అసలింత కథకు కారణమైన డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు.

డైరెక్టర్ సుకుమార్ శిష్యునిలా చాలా వినయంగా కనిపించే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దగ్గర చాలా విషయం దాగుందని ఇప్పటికే టాలీవుడ్ కి తెలిసిపోయింది. సినిమా రిలీజ్ కాకముందే హిట్ టాక్ సొంతం చేసుకుందంటే ఏ రేంజ్ లో ఉప్పెన ఇంపాక్ట్…ఆడియెన్స్ పై పడిందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు అందరూ బుచ్చిబాబుని మెచ్చుకుంటున్నారు. ఇక తన శిష్యుడి గురించి ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు లెక్కల మాస్టార్ కం క్రేజీ డైరెక్టర్ సుకుమార్.

వైష్ణవ్ తేజ్…మెగా ఫ్యామిలీ నుంచి బయల్దేరినా కాస్తంత గర్వం చూపించట్లేదు. రీసెంట్ గా జరిగిన ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైష్ణవ్ మాట తీరుని బట్టి హీరోగా నిలదొక్కుకునేందుకు ఎక్కువరోజులు పట్టదని అనిపించకమానదు. ముఖ్యంగా నేల విడిచి సాము చేసే లక్షణం కాదు వైష్ణవ్ తేజ్ ది. అందుకే మాస్ మసాలా సబ్జెక్ట్ తో హీరోగా…తనని తాను చాటుకునే ప్రయత్నం చేయకుండా డైరెక్టర్ ఫిల్మ్..కథే హీరో అన్న చిత్రాన్ని ఎంచుకున్నాడు.

Source: Mythri Movie Makers

కృతి శెట్టి…ఇప్పుడు కుర్రకారుని నీ కన్ను నీలిసముద్రం అంటూ తన వైపుకు తిప్పుకునేలా చేసిన కన్నడ పరిమళం. అచ్చు తెలుగమ్మాయిలాగానే కనిపిస్తూ…చివరికి ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో సైతం తెలుగులోనే మాట్లాడి ఆహా అనిపించుకుంది కృతి. అందం అంతకుమించిన అభినయం ప్రదర్శిస్తుందనే టాక్ రావడంతో ఇప్పుడు టీటౌన్ డైరెక్టర్స్ వరుసగా కృతి కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు.

హీరోగానే చేయాలనే రూల్ పెట్టుకోకుండా వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న నటుడు విజయ్ సేతుపతి. అసలు హీరోగా చేస్తున్న సమయంలో ఇలా హీరోయిన్ తండ్రిగా చేసే అవకాశాన్ని ఎవరూ అంత ఈజీగా ఒప్పుకోరేమో. కానీ సేతుపతి చేసి చూపించారు. సో ఇలా విడుదలకు ముందే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఉప్పెన టీమ్…విడుదల తర్వాత బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఆహాచిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *