బాబాయ్ – అబ్బాయ్ – అల్లుడు…వెంకటేష్ – రానా – నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ సెట్టయినట్టే అంటున్నారు. నిజానికి వెంకటేశ్, రానా, చైతూ…ముగ్గురు మల్టీస్టారర్ మూవీ అంటే సిద్ధంగా ఉంటారు. ఎలాంటి భేషజాలకు పోకుండా మరో హీరోతో నటించేందుకు ఓకే చెప్తారు. కానీ వీళ్ల ముగ్గురిని ఒకే సినిమాలో హీరోలుగా చూపించేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామానాయుడు సైతం వెంకటేష్ – రానా – నాగ చైతన్య కాంబినేషన్ కోసం  గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఆయన ఉన్నప్పుడు సాధ్యం కాలేదు. కానీ తర్వాత వెంకీ, చైతూ కలిసి ‘వెంకీ మామ’ చేసారు. ఇప్పుడిక వెంకీ, చైతూతో పాటూ రానా సందడి చేయబోతున్నాడు.

రానా హీరోగా తెరెకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ఓ పాటలో మెరిసాడు వెంకటేశ్. వెంకీ మామలో మామ అల్లుళ్లు కలిసి నటించారు. అయితే ముగ్గుర్ని ఒకే ఫ్రేమ్ లో హీరోలుగా చూపించేందుకు ముందుకు వచ్చాడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న. ‘శతమానంభవతి’ చిత్రంతో మంచిపేరు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రత్యేకంగా వెంకీ, రానా, నాగచైతన్య కోసం డిజైన్ చేసిన కథను ఈమధ్యే సురేష్ బాబుకు వినిపించాడట. కథ బాగా నచ్చడంతో సురేష్ బాబు ఓకే చెప్పాడని…ఈయన ప్రతిపాదనకు వెంకటేష్, రానా, చైతూలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాదే ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్ పైకెళ్తుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *