బాలనటిగా పేరుతెచ్చుకొని హీరోయిన్ గా ఫాంలోకి వస్తోన్న టైంలో స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ట్రాక్ తీసుకున్నారు శాలిని. హీరో ప్రశాంత్ జోడీగా 2001లో ఈమె చేసిన చిత్రమే చివరిది. అజిత్ వ్యవహారాలను, ఫ్యామిలీని చూసుకునే భార్యగా…ఇద్దరు పిల్లల తల్లిగా ప్రస్తుతం బాధ్యతను నిర్వర్తిస్తున్నారు షాలిని. అయితే గత కొన్ని రోజులుగా షాలిని మళ్లీ వెండితెరపై కనిపించే అవకాశం ఉందన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం అది నిజమేనని తెలుస్తోంది.
మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలోనే షాలిని కూడా నటించబోతున్నారని టాక్. అది కూడా ఓ హాస్య పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి షాలిని త్వరలోనే విచ్చేసి…చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. అయితే తన జీవితంలో గుర్తుండిపోయే ‘సఖి’ సినిమానిచ్చిన మణిరత్నం అడగ్గానే…కాదనకుండా ఒప్పుకున్నారట షాలినీ.

‘వలిమై’…తమిళ్ స్టార్‌ అజిత్‌ తాజాగా నటిస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రం. ఈ సినిమాను బైక్‌ రేసింగ్‌ నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు హెచ్‌. వినోద్‌ దర్శకుడు. బోనీ కపూర్‌ నిర్మాత. మన ‘ఆర్‌ఎక్స్‌100’ హీరో కార్తికేయ విలన్‌ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్‌ భామ హ్యూమా ఖురేషీ హీరోయిన్. ఇక ఇదే సినిమాలో బాలీవుడ్‌ వర్సటైల్ యాక్టర్ జాన్‌ అబ్రహాం గెస్ట్ పాత్రలో కనిపించనున్నారని టాక్‌. వలిమైతో రేసర్‌ క్యారెక్టర్ లో జాన్‌ నటిస్తారట. రకరకాల బైక్స్, బైక్‌ రేసింగ్‌ అంటే జాన్‌ అబ్రహాంకి మహాసరదా. ఆ సరదాతోనే అజిత్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే నిజమైతే జాన్‌ అబ్రహాం నటిస్తోన్న తొలి తమిళ సినిమా వలిమై అవుతుంది.