మైమరిపించే సొట్టబుగ్గల అందం…మెరుపు తీగ లాంటి మేని సోయగం వెరసి బాలీవుడ్ కలల వయ్యారం..దీపికా పదుకొణే. అయితే అందానికే దీపికాను పరిమితం చేయలేం. గ్లామర్ షోతో పాటే మంచి నటిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణే, ఉజ్వల దంపతులకు 1986 జనవరి 5న ఫస్ట్ బేబిగా జన్మించింది.
డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లో పుట్టినా ఆమెది కర్ణాటక రాష్ట్రం. ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. మాతృభాష కొంకణి. బహుశా తండ్రి నుంచి అబ్బిన లక్షణం కావచ్చు చిన్నతనం నుంచే ఆటపాటల్లో నెంబర్ 1 అనిపించుకునేది దీపికా. తండ్రిలా రాకెట్ పట్టి మైదానంలో విజయఢంగా మోగించేది. పాఠశాలలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో మెరిపించిన దీపికా…ఆపై కళాశాలల్లోనూ ఇంట్రెస్ట్ కనబరిచేది . ఆపై నెమ్మదిగా ఆమెకు యాక్టింగ్ మీద దృష్టి మళ్లింది.

రాకెట్ పట్టడంలో కంటే నటనతో దూసుకుపోవాలన్న కోరిక బలంగా పడింది. దీంతో ముంబై వెళ్ళి మోడల్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అప్పుడప్పుడే చిన్న చిన్న యాడ్స్ చేసుకుంటున్న సమయంలో కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన మన్మథుడు రీమేక్ ఐశ్వర్యలో లీడ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆ తరువాతే 2007లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘ఓం శాంతి ఓం’ తో ప్రేక్షకులను అలరించింది.
ఓం శాంతి ఓం తర్వాత దర్శకురాలు ఫరాఖాన్, హీరో షారుఖ్ ఖాన్ దీపికను ఎంతగానో ప్రోత్సహించారు. హిందీలో దీపిక సెకండ్ మూవీ ‘బచ్ నా యే హసినో’. ఈ ప్రాజెక్ట్ లో రణబీర్ కపూర్ హీరో. ఈ సినిమా సమయంలోనే రణబీర్ తో లవ్ స్టోరి నడిపింది దీపిక. చాందినీ చౌక్ టు చైనా, లవ్ ఆజ్ కల్, హౌస్ ఫుల్, కాక్ టెయిల్, రేస్-2 చిత్రాలతో దీపిక బాలీవుడ్ క్వీన్ గా పేరుతెచ్చుకుంది. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ దీపికాను 200కోట్ల కథానాయికగా నిలబెట్టింది.
అప్పటి బాయ్ ఫ్రెండ్ రణబీర్ తో కలసి మళ్లీ ‘యే జవానీ హై దివానీ’ అంటూ వచ్చింది. అయితే అప్పటికే ఇద్దరి మధ్య ప్రేమ తగ్గుతూ వచ్చి తారాస్థాయికి చేరింది. డిప్రెషన్ కి చేరువయింది. ఆత్మహత్య ఆలోచనలు చేసింది. కానీ కుటుంబ సభ్యులు, డాక్టర్స్ సలహాతో దాన్నుంచి బయటపడింది. అయితే తాను డిప్రెషన్ ని ఎలా ఎదుర్కొన్నానో తెలియజేసి అందరిచేత వావ్ దీపికా అనిపించుకుంది.
మహేంద్ర సింగ్ ధోని, సిద్ధార్ధ్ మాల్యా వంటి వారితోనూ సన్నిహితంగా మెలిగిన దీపికా చివరికి రణ్ వీర్ సింగ్ దగ్గర ఆగింది. ఈ జంట 2013లో నటించిన గలియోంకీ రాస్ లీల రామ్ లీల..ప్రేక్షకుల్మి మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సమయంలో రణ్ వీర్, దీపికల మధ్య ప్రేమ చిగురించడం అది పరిణయంగా మారడం వరకు వెళ్లింది.
కేవలం గ్లామర్ షో తో ఎంటర్ టైన్ చేయకుండా వీలైనప్పుడల్లా మంచి పాత్రలను అంగీకరిస్తుంది దీపికా పదుకొణే. అలాంటివే తమాషా, పీకూ, హ్యాపీ న్యూ ఇయర్, బాజీరావు మస్తానీ, రాబ్తా, పద్మావత్, ఛపాక్ వంటి సినిమాలు. ఇక హాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఫైండింగ్ ఫన్నీ, ట్రిపుల్ ఎక్స్ లతో సత్తా చాటింది.
పెళ్ళయిన తర్వాత కూడా భర్త రణ్ వీర్ తో పాటూ దీపికా బిజీగానే ఉంది. 1983 వరల్డ్ కప్ కథాంశంగా రూపొందుతోన్న ’83’ మూవీలో భర్తతో పాటు కనిపించనుంది దీపికా. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే సైంటిఫిక్ ఫిక్షన్ లో హీరోయిన్ గా నటించనుంది దీపిక. ధూమ్ 4లోనూ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపికా…2021 మొదటిరోజు తన అకౌంట్స్ అన్నింటిని ఖాళీ చేసింది. గత సంవత్సరపు బాధలను మర్చిపోయి…ఫ్రెష్ గా ఈ ఇయర్ ను గడపాలనే ఉద్దేశ్యంతోనే ఆ పని చేసినట్టు చెప్పుకొచ్చింది. సరే ఏదేమైనా తాను కోరుకున్నట్టు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఈ పుట్టినరోజు తర్వాత మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే దీపికా….వెల్క్ం టు టాలీవుడ్.