వైల్డ్ డాగ్ షూటింగ్ పనులు అయిన తర్వాత కింగ్ నాగార్జున…హిందీ ఫిల్మ్ బ్రహ్మాస్త్రతో బిజీగా మారారు. అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వంలో బ్ర‌హ్మాస్త్ర మూవీ ప్యాన్ ఇండియా వైడ్ రూపొందుతుంది. హిందీతో పాటూ తెలుగు, తమిళం, మ‌లయాళ, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ నాగార్జున‌కి సంబంధించిన షూట్ పార్ట్ కంప్లీట్ అయినట్టుగా బ్ర‌హ్మ‌స్త్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇదే విష‌యాన్ని నాగార్జున సైతం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. హీరోహీరోయిన్లు ర‌ణ్‌బీర్, అలియాతో క‌లిసి వర్క్ చేయ‌డం ఆనందంగా అనిపించింద‌ని, నేనూ ఓ కామన్ ప్రేక్ష‌కుడి మాదిరిగా ఈ మూవీ విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నానని ట్వీట్ చేసారు నాగ్. కాగా ఈ సినిమా చిత్రీకరణ ప్ర‌స్తుతం ముంబైలోని భారీ సెట్ లో కొనసాగుతోంది. బిగ్ బి అమితాబ్, మౌనీరాయ్ ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

టీటౌన్ కింగ్ నాగార్జున‌కు దేశ వ్యాప్త గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు వివిధ భాష‌ల్లో న‌టించిన ఆయన 1990వ సంవత్సరంలో శివ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆపై ‘ద్రోహి’, ‘ఖుదా గవా’ చిత్రాలతో పాటూ ‘క్రిమినల్’, ‘జక్మ్’, ‘అగ్నివర్ష’ వంటి బాలీవుడ్ సూపర్ హిట్స్ లో నటించారు. అయితే 2003లో విడుదలైన ‘ఎల్.ఓ.సీ కార్గిల్’ ఆయన కనిపించిన చివరి హిందీ సినిమా. మ‌ళ్ళీ 15 ఏళ్ల త‌ర్వాత బ్ర‌హ్మాస్త్రతో బీటౌన్ రీఎంట్రీ ఇస్తున్నారు నాగార్జున.