కథ, కథనాలను నమ్ముకోకుండా వడ్డించిన సరుకులో హీరోయిన్ టేస్ట్ కుదరలేదని…తప్పించుకుంటారు కొంతమంది దర్శకనిర్మాతలు. అప్పుడలాగే శృతీహాసన్ పై ఐరన్ లెగ్ ముద్రవేశారు. అయితే కొన్ని హిట్స్ తర్వాత కొన్ని ఫ్లాప్ లు చూసిన శృతీ…పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయింది. అయితే ఇప్పుడీ సుందరిపై కొత్తగా మరో కహానీ అల్లుతున్నారు.
నేరుగా హీరోయిన్ గా నటిస్తే శృతీకి కలిసిరాదని…ఫ్లాప్స్ లో ఉన్న హీరోతో జతకడితే…ఆ హీరోకి, ఈ హీరోయిన్ కి బ్లాక్ బస్టర్ దక్కుతుందని చెబుతున్నారు. కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఫస్ట్ హిట్ అందుకుంది గబ్బర్ సింగ్ తో. ఈ సినిమా వరకు పవన్ కల్యాణ్ కూడా అనేక అపజయాలను చవిచూసారు. ఇక నేనొక్కడినే, ఆగడు వంటి వరుస పరాజయాలతో బ్రేక్ పడిన మహేశ్ బాబు మళ్లీ హిట్ కొట్టింది శ్రీమంతుడితోనే. మరి ఇందులో హీరోయిన్ శృతీహాసన్.
మాస్ రాజా రవితేజనే తీసుకుందాం. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ అంటోనీ, డిస్కోరాజా సినిమాలతో కొంతకాలం నుంచి సరైన హిట్ లేదు. ఇప్పుడు శృతీతో కలిసి క్రాక్ ని దించాడు రంగంలోకి. సూపర్ హిట్టై కూర్చుంది క్రాక్.
సో…ఈ రకంగా వరుస ఫ్లాప్స్ ఉన్న హీరోలు…శృతీని ఎంగేజ్ చేసుకుంటే విజయం దక్కుతుందని కథలు చెప్తున్నారు. సరే ఇలాగైనా మళ్లీ శృతీ బిజీగా మారుతుంది. అవును..పవర్ స్టార్ సైతం ఇప్పుడు అపజయాలతోనే ఉన్నారు. ఈ లక్కీ సెన్స్ ప్రకారం వకీల్ సాబ్ సూపర్ హిట్టవ్వాలి. చూద్దాం ఏం జరుగబోతుందో…