మార్చి 26న భీకర యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజైంది. నిజమైన యుద్ధం కాదది. రెండు అతిభారీ ప్రాణుల మధ్య జరగబోయే సమరం. అదే ‘గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్’ చిత్రం. వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మాణంలో ఆదామ్‌ వింగార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజైంది. ‘‘మనకు ఇదొక్కటే మార్గం’’ అంటూ మొదలై… చివరికి ‘‘ కాంగో ఎవరి ముందు తలవంచడు’’ అంటూ ముగిసిన ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా కట్టిపడేస్తుంది. గాడ్జిల్లా, కాంగ్ మధ్య పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నగరం మీదపడి విధ్వంసం సృష్టించే గాడ్జిల్లాను నాశనం చేసేందుకు రంగంలోకి దిగిన కాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇదివరకు ఎన్నో సినిమాల్లో గాడ్జిల్లా, కాంగ్‌లను ప్రధాన పాత్రలుగా చూపించారు. గాడ్జిల్లా… కింగ్‌ ఆఫ్‌ ది మాన్‌స్టర్స్‌ నుంచి మొదలుపెడితే… ఆఫ్ ‌ది ఎడ్జ్‌ ఆఫ్‌ బ్యాటిల్‌ వరకు మొత్తం 40 పైగా ఈ నేపథ్యంలో చిత్రాలు వచ్చాయి. ఇక కాంగ్‌ సైతం ఎక్కడా తగ్గేది లేదంటాడు! 1933లో రిలీజైన కింగ్‌ కాంగ్ నుంచి నిన్నమొన్నటి కాంగ్‌ స్కల్‌ ఐలాండ్‌ వరకు చాలా సినిమాలతోనే కేక పెట్టించాడు కాంగ్. ఇక ఇప్పుడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అంటూ మార్చి 26న థియేటర్స్ తో పాటూ హెచ్‌బీఓ మ్యాక్స్‌ లలో ఒకేసారి ఈ మూవీ రిలీజ్ కి రెడీఅయింది.