తెలుగు పాటకు సరికొత్త ఊపిరి… కిట్టు విస్సాప్రగడ

కరోనా వేళ లాక్ డౌన్ అంటూ జనం బిక్కుబిక్కుమంటున్న టైమ్ లో…వాళ్లకి సరాగాల రుచి చూపించారు. ఎవరీ పాటల రచయిత అనుకునేలా చేసారు. తరగతి గది దాటిన ప్రేమను, గుంటూరు ఆత్మ అందాలను కళ్లకు కట్టినట్టు తన పాటలతో ప్రేక్షకులకు పంచారు. ఆయనే పాటల రచయిత కిట్టు విస్సాప్రగడ. పెద్ద వయస్సు కూడా కాదు…నిండా 30ఏళ్లు…కానీ జీవితసారాన్ని, పదాల పరిమళాన్ని ఆస్వాదించడం…ఆస్వాదింపజేయడం ఆయనకి బాగా తెలుసు.

తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం ఆయన స్వస్థలం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే కథలు వింటూ పెరిగారు. ముఖ్యంగా నిద్రపుచ్చడానికి అమ్మమ్మ పాడిన పాటలు ఆయనపై అమిత ప్రభావాన్ని చూపించాయి. మహాకవి కాళిదాసు ప్రభందాలు…చేస్తే ఇలాంటి రచన చేయాలనే కోరికను రగిలిస్తే… సీతారామశాస్త్రి గారి అక్షరసత్యాలు జీవితానికి మార్గదర్శిలా స్ఫూర్తినిచ్చాయి. అన్ని రకాల సాహిత్యానికి తన కలంతో పనిచెప్పిన వేటూరి ప్రభావం సరేసరి.

ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే సినిమా పాటలు రాయాలన్న ఆశయాన్ని బలంగా ముద్రించుకున్నారు. అయితే నాన్నకు కుటుంబ భారం తగ్గించాలనే ఆలోచనతో మొదట..హైదరాబాద్‌ గూగుల్‌ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా రెండేళ్లు ఉద్యోగం చేసారు. తర్వాత ఫేస్ బుక్ లోనూ పనిచేసారు. ఆపై తన చెల్లికి ఉద్యోగం రావడంతో కిట్టు ఉద్యోగం మానేసి సినిమా కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టారు.

దశమి అనే చిత్రంతో 2014లో సినీ కెరీర్ ను ప్రారంభించారు కిట్టు విస్సాప్రగడ. ఇప్పటివరకు దాదాపు 70 సినిమాలలో 150కి పైగా గీతాలు రచించారు. లవర్స్, మిర్చిలాంటి కుర్రాడు, గుంటూరు టాకీస్, మెంటల్ మదిలో, రంగులరాట్నం, చి ల సౌ, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలకు పాటలు రాసిచ్చినా…అసలైన హుషారునిచ్చింది మాత్రం‘ఉండిపోరాదే’గీతమే.

తాజాగా కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రాలు కిట్టుకు మంచిపేరు తీసుకొచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమాల్లో ఈయన రాసిన పాటలు మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఒరేయ్ బుజ్జిగా, కృష్ణ అండ్ హీజ్ లీల, మా వింత గాథ వినుమా సినిమాల్లోని పాటలు సైతం శ్రోతల మనసును దోచినవే. ఇక ఇదే జోష్ తో మరిన్ని సినిమాలకు పాటలు రాస్తున్న కిట్టు విస్సాప్రగడ కెరీర్ లో…మరిన్ని మంచి పాటలు రావాలని కోరుకుందాం.