మాస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి పనిచేయనున్నారు తమిళ్ స్టార్ విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. 2021 సంక్రాంతికి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజైన ‘మాస్టర్‌’..తమిళంలో హిట్ అనిపించుకున్నా..తెలుగులో ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. అయితే విలన్ గా కనిపించిన విజయ్ సేతుపతికి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్‌ ‘‘త్వరలోనే విజయ్‌ సార్ తో ఓ మూవీ చేస్తున్నా. అది ఖచ్చితంగా మంచి పేరుతో పాటూ సూపర్ హిట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇంతకుమునుపు ఎప్పుడూ చూడని విజయ్‌ ని సరికొత్తగా చూస్తారని’’ తెలిపారు. లోకేష్‌ కనగరాజ్, విజయ్ కాంబో మూవీ ‘తలపతి66’ సినిమాను తేనందల్ స్టూడియోస్‌ ప్రొడ్యూస్ చేయనుందని టాక్. గతంలో విజయ్ హీరోగా నటించిన మెర్సల్ సినిమా… తేనందల్‌ స్టూడియోస్‌ నుంచి వచ్చిందే. మాస్టర్ తర్వాత విజయ్‌ కమిటైన 65వ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అటు లోకేష్‌ కనగరాజ్‌ – కమల్‌ హాసన్‌ కాంబోలో ‘విక్రమ్‌’ అనే మూవీ రాబోతుంది. మే నెలలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

కోలీవుడ్‌లో ఓ సూపర్ ఆఫర్‌ అందుకున్నట్టు ఆ మధ్య రష్మికపై వార్తలొచ్చాయి. తమిళ్ ‘డాక్టర్‌’ మూవీ ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్లో స్టార్‌ హీరో విజయ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. మాస్టర్ తర్వాత విజయ్‌ 65వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో విజయ్‌ సరసన కొంతమంది హీరోయిన్స్ పేర్లు చర్చకు వచ్చినా రష్మికకే ప్రియారిటీ ఇచ్చారట దర్శకనిర్మతలు. అయితే కన్నడబ్యూటీ బిజీ షెడ్యూల్స్ కారణంగా విజయ్ సినిమాకి నో చెప్పిందని సమాచారం.

రష్మిక స్థానంలో విజయ్‌ జంటగా పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు. ఈమధ్యే విజయ్ సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది పూజాహెగ్దే. దీంతో మేకర్స్ పూజాహెగ్దే వైపు చూస్తున్నట్టు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’, శర్వానంద్‌ జోడీగా ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో ‘మిషన్‌ మజ్ను’ , ‘డాడి’ సినిమాల్లో నటిస్తోంది. కాగా తమిళంలో రష్మిక నటించిన మొదటి సినిమా ‘సుల్తాన్‌’ ఏప్రిల్‌ 2న రిలీజ్ కానుంది.

తమిళ్ స్టార్ హీరో విజయ్‌ కొత్త సినిమాపై ఓ ఉత్కంఠ నెలకొంది. ఆయన తాజాగా నటించిన సినిమా ‘మాస్టర్‌’. దీనికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ అనుకున్నంత ఆదరణ లభించలేదు. దీని తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ కు పచ్చా జెండా ఊపారు విజయ్‌. డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ విజయ్‌ 65వ సినిమాకి తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ కోసం గట్టి గాలింపు చేపట్టారట. అందుకోసం ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. పూజాహెగ్దేతో పాటూ కియారా అద్వాణి, రష్మిక మందనను సంప్రదించారట
మేకర్స్. కానీ ఈ ముగ్గురిలో విజయ్‌ సరసన ఎవరు మెరుస్తారన్నది ప్రస్తుతానికి ఆసక్తిగ మారింది.

కేజీఎఫ్‌ చాప్టర్స్ స్టంట్ మాస్టర్స్ అన్బు – అరివులు విజయ్ కొత్త చిత్రానికి యాక్షన్ పార్ట్ ను కొరియోగ్రాఫ్ చేయబోతున్నట్టు టాక్. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్నివిడుదల చేస్తారట. డైరెక్టర్ నెల్సన్ తన ఫస్ట్ మూవీ నయనతార నటించిన కోలమావు కోకిలాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడిక స్టార్ విజయ్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నారు.

ఎంట్రీ కోలీవుడ్ మూవీతోనే ఇచ్చినా…మళ్లీ ఇంతవరకు తమిళ్ తెరపై నేరుగా కనిపించలేదు పూజాహెగ్దే. 2012లో మూగమూడి అనే తమిళ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఆ వెంటనే నాగచైతన్య జోడిగా ఒక లైలా కోసం ఆఫర్ రావడం…తర్వాత వరుస తెలుగు చిత్రాలకు కమిటవ్వడంతో కోలీవుడ్ వైపు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఎన్టీఆర్ అరవింద సమేత, మహేశ్ మహర్షి సినిమాలతో హిట్స్ కొట్టి…అల్లు అర్జున్ అల వైకుంఠపురంతో ఏకంగా బాక్సాఫీస్ నే బద్దలుకొట్టింది పూజాహెగ్దే..దీంతో బాలీవుడ్ జనాలు పిలిచిమరీ ఆఫర్లు ఇస్తున్నారు. ప్రస్తుత తెలుగు, హిందీ భాషల్లో తీరికలేనంత సమయాన్ని గడుపుతున్నారు పూజాహెగ్దే.

అయితే తాజాగా కోలీవుడ్ నుంచి ఆమెకు పిలుపొచ్చింది. తమిళ్ మాస్ స్టార్ విజయ్ 65వ చిత్రానికి ఈ భామనే హీరోయిన్ గా నటించమన్నారని టాక్. ఈ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రీసెంట్ గా పూజాని కలిసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేసారట. అయితే కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడంతో కాస్త టై ఇమ్మని అడిగిందట పూజా హెగ్దే. మరి చూడాలి…ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే విజయ్ సినిమాలో పూజా హెగ్దే నటిస్తుందో…లేదో…

ఒక్క మాటలో …

తమిళ స్టార్ హీరో …గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం…అయినా సరే… తెలుగు ప్రేక్షకులు పూర్తిగా అంగీకరించని, తెలుగులో పెద్దగా మార్కెట్ లేని హీరో…విజయ్. కానీ ఫస్ట్ టైమ్ ఎప్పుడూ లేనంత బజ్ క్రియేట్ చేస్తూ ఆరు వందలకు పైగా తెలుగు తెరలపై మాస్టర్ బొమ్మ పడింది. నిజానికి మాస్ ఎలిమెంట్స్ ని మేజిక్ చేసి చూపించిన ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే దళపతి విజయ్ తో పాటు సేతుపతి విజయ్ కూడా నటించడం కలిసొచ్చింది. ఇంకేముంది పండగ సందడిని క్యాచ్ చేసేందుకు మార్నింగ్ నుంచే పాఠాలు మొదలెట్టాడు మాస్టర్ విజయ్. చిరూ సూపర్ హిట్ మాస్టర్ పేరునే పెట్టుకొని రచ్చ చేయడానికి వచ్చిన ఈ డబ్బింగ్ మాస్టర్ ఎలా ఉంది? కథాకమామిషు ఏంటి?…తెలుసుకుందాం.

ఇదీ కథ…

ఓ తాగుబోతు లెక్చరర్ గా ఎంట్రీ ఇస్తాడు హీరో విజయ్. డ్రింకర్ అయినా…పాఠాల్లో, మంచి చెప్పడంలో నంబర్ 1. హీరోకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది కాలేజీలో. అక్కడే పని చేసే హీరోయిన్ (మాళవిక మోహనన్) చారులతతో ప్రేమ ప్రయాణం సాగిస్తుంటాడు. అయితే కాలేజ్ లో గొడవ కారణంగా అక్కడి నుంచి బయటికొచ్చి బాల నేరస్థుల జువెనైల్ హోమ్ కు టీచర్ గా వెళతాడు. ఆ హోమ్ ని…అక్కడి బాల నేరస్థులను తన చెప్పుచేతల్లో నడిపిస్తుంటాడు విలన్ విజయ్ సేతుపతి (భవాని). ఈ విషయం మాస్టర్ విజయ్ కి తెలియడం, విలన్ ఎత్తుగడలను తొక్కేస్తుండటం, చివరికి ఇద్దరు బరిలోకి దిగడం… ఇదీ స్థూలంగా కథ.

ఇదీ నటన

మొదటినుంచీ కమర్షియల్ చిత్రాలను ఎంచుకొని నటించడానికి స్కోప్ లేకుండా చేసుకున్నాడు విజయ్. నటనలో లెవెల్ చూపించక పోయినా…విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ అప్పెరీన్స్ విజయ్ సొంతం. ఈ రీజన్ తోనే ఇంతకాలం నుంచి స్టార్ హీరోగా ట్రెండ్ సృష్టిస్తున్నాడు. అయితే మనం మొదటే చెప్పుకున్నట్టు ఆరవ ప్రేక్షకులు ఆరాధించినట్టు…మనవారు విజయ్ ని 50% కూడా ఓన్ చేసుకోలేకపోయారు. సరే..మాస్టర్ విషయానికొస్తే, పుష్కలంగా ఉన్న మాస్ ఎలవేషన్స్ లో దూసుకుపోయాడు. అలవాటైన పనే కాబట్టి అలవోకగా నటించాడు.
విజయ్ సేతుపతి…ప్రస్తుతం అన్ని భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటుడు. హీరోగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా…వేరే హీరో నటిస్తున్న సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ నటనకు పట్టం కడుతున్నాడు విజయ్ సేతుపతి. ఇందులో కూడా అంతే గుండాగా రెచ్చిపోయాడు. విలన్ గా విశ్వరూపాన్ని చూపించాడు.
చాలా సన్నివేశాల్లో విజయ్ ని డామినేట్ చేసినట్టు అనిపించాడు సేతుపతి.

హీరోయిన్ మాళవిక మోహనన్ చూడటానికి అందంగా ఉంది. నటనపరంగా మాళవిక కన్నా ఆండ్రియా బాగా మెప్పించింది. ఇక మిగిలిన వాళ్ళందరూ వచ్చిపోతుంటారు. పెద్దగా గుర్తుంచుకునే స్కోప్ ఎవ్వరికీ లేదు.

ఇదీ డైరెక్షన్

నగరం, ఖైదీ చిత్రాలతో స్పెషల్ టేస్ట్ ఉన్న దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ పేరు సంపాదించాడు. కార్తీని ఖైదీగా చూపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే మాస్టర్ తో దారితప్పాడు లోకేష్. విజయ్ తో సినిమా అనగానే కమర్షియల్ యాంగిల్ పై కాన్సంట్రేట్ చేశాడు. అక్కడే స్టోరీ పై గ్రిప్ కోల్పోయాడు. కొన్ని హీరో ఎలివేషన్ సీన్స్ సహనానికి పరీక్ష పెడతాయి.

ఇదీ మిగిలింది

అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ తెలుస్తున్నాయి. ఇంతకు మించి చెప్పటానికి ఏమి లేదు.

కలిసొచ్చే అంశాలు

విజయ్ సేతుపతి యాక్టింగ్
విజయ్ ఎలివేషన్ సీన్స్
నేపథ్య సంగీతం
ఇంటర్వెల్ సీన్

కలిసి రానివి

సాగతీత
పాటలు
రెగ్యులర్ స్టోరీ

తీర్పు

మాస్టర్ బోర్ కొట్టించాడు

what’s your rating on Vijay’s Master Movie

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 2.67 out of 5)
Loading...

తమిళ రాజకీయ తెరపై సరికొత్త సినిమా ప్రదర్శితమవుతుంది.  ఊహించని మలుపులు, కొత్త ఆలోచనలు వెరసి ప్రేక్షకుల్లా మారిన తమిళ్ ఓటర్లలో ఉత్కంఠ రేపుతుంది. ఏ పావు ఎటు కదులుతుందా? అన్న సందిగ్ధత నెలకొంది. ఎన్నో చర్చలు, మంతనాల తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు రజనీకాంత్. ఇదివరకు చాలాసార్లు ఇలాంటి వార్తలు వినిపించినా…ఈసారి స్వయంగా తలైవానే చెప్పేసరికి అరవ పాలిటిక్స్ సమీకరణలు మార్చుకునే పనిలోపడ్డాయి. అయితే అన్నాత్తే షూటింగ్ లో ఆరోగ్యం దెబ్బతినడం, ఆసుపత్రి పాలవడం, రిటర్న్ టు చెన్నై, కూతుర్లు రాజకీయలు వద్దనడం….అన్నీ చకచక జరిగిపోయి ‘నేను రాజకీయాల్లోకి రాలేకపోతున్నాను.. క్షమించండి’ అంటూ అభిమానులకు బహిరంగ లేఖ విడుదల చేసారు. 

‘మక్కల్ సేవై కర్చీ’ పేరుతో పార్టీని స్థాపించి తమిళ్ పాలిటిక్స్ లో తనదైన ముద్రవేయాలని భావించారు రజినీకాంత్. ఎంజీఆర్ జయంతి వేళ జనవరి 17న పార్టీని అనౌన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎవరో అనుకున్నట్టు అపోలోలో నడిచిన మంతనాల ప్రభావమో…నిజంగానే ఆరోగ్య సమస్యలో కానీ రాజకీయాల్లోకి వచ్చేదే లేదని రజినీకాంత్ ప్రకటించారు. ఏదైనా కానీ నిజానికి ఆయన వయసురీత్యా తీసుకున్నది మంచి నిర్ణయమే. అయితే ఈ ప్రకటనతో వ్యూహాలు రచిస్తున్న పార్టీలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి . రజనీ ప్రభంజనాన్ని తట్టుకునేలా  ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే,  కమల్ హాసన్… తదితరులు వివిధ రకాల ఆలోచనల్లో మునిగిపోయారు. కానీ.. తాజా పరిణామంతో తమ ప్లాన్స్ మొత్త తుడిచేసుకుంటున్న సమయంలో మరో పిడుగులాంటి వార్త చెవునపడింది.

రజినీ ప్రకటనతో మారిన రాజకీయ పరిస్థితిని తన వైపుకు తిప్పుకునేలా ఇళయతలపతి విజయ్ ప్లాన్ గీస్తున్నారన్నది తమిళనాట ప్రస్తుతం హాట్ టాపిక్. పాలిటిక్స్ అంటే ఎప్పచినుంచో విజయ్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రజినీ వెనుకడుగు…విజయ్ ని ముందుకు నడిపించింది. త్వరలో జరగబోయే అరవ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తన అభిమాన సంఘం ‘మక్కల్ ఇయక్కం’ కార్యకర్తలతో భేటీఅయ్యారట.

ఇక డిసెంబర్ 31వ తేదీనే తలపతి విజయ్ తన పార్టీని కూడా ప్రకటించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ‘పీపుల్స్ మూమెంట్ పార్టీ’ పేరుతో ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ వద్ద రిజిస్టర్ చేసారని సమాచారం. రీసెంట్ గా తమిళనాడు సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్.. ఈ నెల 31న జయలలిత సమాధి చెంత తన పార్టీ పేరును ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతటి ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు రాజకీయాల్లో జరిగే మార్పులేమిటి? విజయ్ రాజకీయ నిర్ణయం నిజంగా తీసుకున్నాడా? అన్నది తెలియాలంటే డిసెంబరు 31 వరకు ఆగాల్సిందే.