తెలుగులో చాలా కాలం తర్వాత హిట్ కొట్టాలని చూస్తుంది ప్రముఖ నిర్మాణ సంస్థ…’మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్’. ఓ బేబి తర్వాత జాంబిరెడ్డితో పాటూ మరో సైన్స్ ఫిక్షన్ చేస్తున్న ‘తేజ సజ్జ’ హీరోగా ఈ సినిమాను అనౌన్స్ చేసారు. కన్నుగీటి యువహృదయాలను కొల్లగొట్టిన ‘ప్రియా వారియర్’ ఇందులో హీరోయిన్. ఎస్ ఎస్ రాజు దర్శకుడు. ‘ఇష్క్’ అనే పేరుతో టైటిల్ లోగోను తాజాగా లాంచ్ చేసారు ఆర్.బి.చౌదరి. అయితే ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది దీనికి ట్యాగే లైన్.
మలయాళ బ్లాక్ బస్టర్ ఇష్క్ మూవీకి ఇది రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నిర్మాత ఆర్.బి.చౌదరికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, సంక్రాంతి, అందాల రాముడు, గోరింటాకు అంటూ చాలా పద్ధతైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్…ఈ సినిమాతో తన పంథాను మార్చుకుంటుందా?తేజ సజ్జ, ప్రియా వారియర్ వంటి యంగ్ ఆర్టిస్టులతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందా? అన్నది చూడాలి.