బాలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతుంది కృతీసనన్. ఆదిపురుష్ లో సీతగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కృతీ…ఇప్పుడు బుట్టబొమ్మగా నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్. తెలుగు అల వైకుంఠపురంలో బుట్టబొమ్మలా పూజాహెగ్దే మెప్పిస్తే…ఈ మూవీ రీమేక్ హిందీ బుట్టబొమ్మగా కృతీ కనిపించనుందనే వార్త జోరందుకుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా బాలీవుడ్లో రీమేక్‌ కానున్న సంగతి తెలిసిందే. కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా…హీరో వరుణ్‌ ధావన్‌ బ్రదర్ రోహిత్‌ ధావన్‌ ఈ రీమేక్‌ ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులోనే హీరోయిన్ గా కృతీని అడిగినట్టు చెబుతున్నారు.
ప్రజెంట్ వరుణ్‌ ధావన్‌, కృతీ సనన్‌ జంటగా నటిస్తున్న హిందీ మూవీ ‘భేదియా’ ఏప్రిల్‌లో రిలీజ్ కాబోతుంది. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ జోడీగా ‘బచ్చన్‌ పాండే’ సినిమాలో నటిస్తుంది కృతీ. ఇటీవలే ప్రభాస్‌ రామునిగా నటిస్తోన్న ప్యాన్‌ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్రకు సెలెక్ట్ అయింది. ఇంత బిజీగా ఉంది కాబట్టే ఓసారి డైరీ తిరగేసి ‘అల వైకుంఠపురములో’ రీమేక్‌ మూవీకి డేట్స్‌ అడ్జస్ట్ చేయాలనుకుంటుందట. జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి బుట్టబొమ్మగా కృతీనే చిందులేస్తుందా? వేరే హీరోయిన్ సీన్లోకి వస్తుందా? చూడాలి.