బిగ్ బాస్ ఫినాలేలో మాటిచ్చినట్టుగానే ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మెహ‌బూబ్‌కు ఆచార్య‌లో కీ రోల్ పోషించే ఛాన్స్ ఇచ్చారట చిరూ. ఇందులో జానపద నృత్యకారుడిగా..మెహబూబ్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఇంట్రవెల్ కి ముందు చనిపోయే పాత్రతో ఓ రేంజ్ ట్విస్ట్ ఇస్తాడట మెహబూబ్.

మామ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంటే…అల్లుడు స్నేహ ధర్మాన్ని పాటిస్తున్నాడు. మంచు మనోజ్ అహం బ్ర‌హ్మాస్మి సినిమాలో గెస్ట్ రోల్‌ చేసేందుకు సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడ‌ట‌. పాత్ర వ్య‌వ‌థి త‌క్కువే అయినా సినిమాను మ‌లుపు తిప్పే పాత్ర అని స‌మాచారం. మనోజ్, సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే ఫ్రెండ్ కోసం కాదనకుండా అహం బ్రహ్మాస్మీ అంటున్నాడు తేజ్. కాగా మంచు మనోజ్ కిది కమ్ బ్యాక్ మూవీ. అహం బ్రహ్మాస్మీ రిజల్ట్ పై మనోజ్ సినీ కెరీర్ ఆధారపడిఉంది.

అల్లు అర్జున్ పుష్ప మూవీలో విలన్ గా మంచు మనోజ్ ని సెట్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ ఈ విషయమై మనోజ్ ని కలిసాడని టాక్. నిజానికి పుష్ప చిత్రంలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించాల్సింది. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సేతుపత తప్పుకోవడంతో ఆ రోల్ కోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్య అన్నారు. ఆ తర్వాత నారా రోహిత్ తో పాటూ కొంతమంది కన్నడ నటులు వార్తల్లో నానారు. చివరికి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి..పుష్ప విలన్ గా ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. కానీ చివరికి మళ్లీ మొదటికొచ్చి మంచు మనోజ్ దగ్గర ఆగింది విలన్ టాపిక్.

ఓ వైపు విలన్ లేకుండానే పుష్ప షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. ఇంకా సుకుమార్ ప్రతినాయకుడి విషయంలో డైలామాలోనే ఉన్నారు. మరి మంచు మనోజ్ అయినా చివరికి సెట్ అవుతాడా అన్నది చూడాలి. బన్నీ, మనోజ్ మంచి స్నేహితులు. వేదం సినిమాలో ఇదివరకు కలిసి కనిపించారు. ఇక మనోజ్..విడాకులు వంటి వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాకు దూరమయ్యారు. తను చివరిగా నటించిన అహం బ్రహ్మాస్మి విడుదల కావాల్సిఉంది.

మంచువారబ్బాయి మనోజ్‌ రెండో పెళ్లి గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే మొదటి భార్యతో విడాకుల ప్రాసెస్ సైతం పూర్తయింది. ఇక మంచు మనోజ్ రెండోసారి పెళ్లిపీటలెక్కబోతున్నాడనే వార్త ఊపందుకుంది. ఇంతకీ ఈయన పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరన్న దానిపై సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్‌ హీరోయిన్‌ని మనోజ్‌ చేసుకుంటడని అనుకున్నా…అది నిజం కాదని సన్నిహితులు ప్రకటించారు. మోహన్‌బాబు ఫ్యామిలీ బంధువైన అమ్మాయితోనే మనోజ్‌ పెళ్లి జరుగబోతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్ రానుంది. అంతేకాదు మే నెలలలోనే వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్సయిందని సమాచారం.
2015లో లవ్ మ్యారేజ్ చేసుకున్న మనోజ్‌, ప్రణతి..మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలతో మూడేళ్లపాటు మనోజ్‌..సినిమాలకు దూరమైపోయాడు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మస్మి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి అనే డైరెక్టర్ టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమవుతున్నారు.

మంచు మనోజ్… తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని బహుముఖ ప్రతిభావంతులలో ఒకరని చెప్పొచ్చు. అయితే కథలు సరిగా ఎంచుకోలేక ఫ్లాప్ లు చుట్టుముట్టడం, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు….ఇలా పరిస్థితులు ఎలాంటివైనా మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే త‌న రీ ఎంట్రీకి ఈ మ‌హ‌మ్మారి స‌మ‌యాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. రెండు విష‌యాల‌పై పూర్తి దృష్టి సారించారు. ఒక‌టి బ‌రువు త‌గ్గ‌డం మ‌రొక‌టి త‌ను సంత‌కం చేసిన రెండు ప్రాజెక్ట్స్ ప్రీ- ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ చూసుకోవ‌డం.

మంచు మ‌నోజ్ ఏకంగా 15 కిలోలు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారాడు. ఆయుర్వేదిక్ డైట్, కఠినమైన వ్యాయామం చేసి మనోజ్ స్లిమ్‌గా మారాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మనోజ్ హార్డ్ వర్క్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి తెలుగు దర్శకుడితో, రెండోది తమిళ దర్శకుడితో.. ఈ రెండు కూడా తెలుగు, తమిళ ద్విభాష చిత్రాలే కావడం విశేషం. ఈ రెండు ప్రాజెక్ట్ లను 2021లో విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మంచు మ‌నోజ్‌. వీటితో పాటు స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సిటీ కూడా డెవ‌ల‌ప్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దాని గురించి వివ‌రించ‌నున్నాడు. 2021 మంచు మ‌నోజ్‌కు కొత్త ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ రాక్ స్టార్.