మనందరి జీవితాల్లో ప్రతి సంవత్సరం ఏవో కొన్ని జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తుంది. ఏడాదిపాటూ జరిగిన అనుభవాలు వినూత్న అనుభవాల్ని పరిచయం చేస్తాయి. అయితే ప్రతి సంవత్సరం వేరు…ఈ 2020వ సంవత్సరం వేరు. చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్నే రాసుకుంది. ప్రపంచాన్ని కలవారపాటుకు గురిచేసింది. ఎన్నో గుణపాఠాలను నేర్పింది. మన ప్రణాళికలు ఎంత పఠిష్టంగా ఉండాలో ఎత్తిచూపింది. ఊహించని పరిణామాలను ఎదురయ్యేలా చేసింది. చాలామందికి అత్యంత కఠినంగా…అతికొద్దిమందికి అదృష్టంగా మారింది. మరికొన్ని రోజుల్లో 2020కి స్వస్తి పలికి 2021 సంవత్సరంలోకి అడుగిడబోతున్న సందర్భంగా ఓసారి 2020 జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం.

ఇప్పటికీ భయపెడుతోంది

2020 అనగానే ఠక్కున మనకు గుర్తొచ్చేది…కరోనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని వణికించింది కరోనానే. 2019లోనే వెలుగుచూసినా…2020లో దేశాలన్నింటికీ వ్యాపించి విశ్వరూపాన్ని చూపించింది. వూహాన్ లో కొత్త రకం న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయన్న చైనా అధికారిక ప్రకటనను డబ్ల్యూహెచ్వో తొలిసారి 2019 డిసెంబరు 31న పరిగణనలోకి తీసుకుంది. అనంతరం 2020 జవనరి 1న దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోరింది. రోజులు గడుస్తున్న కొద్దీ వైరస్ విస్తృతంగా వ్యాపించింది. జనవరి 9న ఇది కొత్త రకం కరోనా వైరస్ అని గుర్తించింది. కొన్ని రోజులకు ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా తేలికగా వ్యాపి చెందుతుందని తెలిసింది. జనవరి 11న తొలి మరణం నమోదైంది. అదే నెల 13 నుంచి ప్రపంచవ్యాప్త దేశాల్లో కరోనా కలకలం సృష్టించడం ప్రారంభమైంది. ఉరుకులు పరుగులుతో ముందుకు సాగిపోతున్న మన జీవన శైలికి అనుకోని రీతిలో అనూహ్యంగా బ్రేక్ పడింది, అదే లాక్ డౌన్. పాజిటివ్, నెగెటివ్…చావులు…బతికిబట్టకట్టడాలు… వివిధ రకాలుగా లాక్ డౌన్ ల తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటపడుతుంది, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అనుకుంటుండగా మళ్లీ బ్రిటన్ లో కొత్త రకం కరోనా బయటపడింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. ఏదేమైనా ప్రతి సంఘటన వెనుక ఓ పాఠం ఉంటుందన్నట్టు కరోనా మనుషులకు సరికొత్త విషయాలను నేర్పించింది.

యుద్ధం – సంసిద్ధం

Image courtesy: OIAC

2020కి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తమ పోరాటాలతో స్వాగతం పలికాయి. 2019 డిసెంబరు చివర్లో ఈ రెండు దేశాల మధ్య రేగిన వివాదం…జనవరి 3న ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యతో తారాస్థాయికి చేరింది. ఓ దశలో యుద్ధం ఆణివార్యమనే సంకేతాలు అందాయి. పైగా ప్రపంచ దేశాలు ఈ విషయంలో రెండుగా చీలడంతో ప్రపంచయుద్ధం రావొచ్చనే డిబేట్లు జరిగాయి. ఈలోపు ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. ఈ సమయంలో ఉక్రెయిన్ విమానాన్ని పొరబాటున కూల్చేసింది. ఈ ఘటనలో 170కి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా కత్తులు దూసింది. చివరికి ఇరాన్ తన తప్పును అంగీకరించింది. ఏడాది చివర్లో ఇరాన్ అణుపితామహుడు మొసిన్ ఫక్రజాదే హత్య మళ్లీ ఉద్రిక్తతలకు దాసితీసింది. అయితే ఈ ఘటనకు కారణం ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొరాన్ అని ఆరోపించింది ఇరాన్.

కోబీ బ్రయంట్ మరణం

జనవరి 26న ఎన్ బీ ఏ లెజండ్ ఇక లేడన్న వార్త యావత్ ప్రపంచాన్ని బాధపెట్టింది. అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబీ బ్రయంట్ తన కుమార్తెతో సహా హెలీకాప్టర్ ప్రమాదంలో లాస్ ఏంజిల్స్ లో కన్నుమూసారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర విషాదంగా మిగిలింది.

ఆస్ట్రేలియా అగ్ని ప్రమాదం

2019 జూన్ లో ప్రారంభమైన కార్చిచ్చు 2020 మే వరకు కొనసాగింది. క్వీన్స్ ల్యాండ్ లో మొదలై ఆస్ట్రేలియాకు బ్లాక్ సమ్మర్ ని మిగిల్చింది. కోట్లాది వన్యప్రాణులు సజీవదహనమయ్యాయి. బూడిద రూపంలో మిగిలిన కొన్ని జీవాల అవశేషాలు ప్రతిఒక్కరినీ కలచివేసాయి. ఈ మంటల వల్ల 103 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల నష్టం తలెత్తింది. కొన్ని కోట్ల ఎకరాల విస్తీర్ణంలో మంటలు చెలరేగగా…20వేల కట్టడాలు ఆహుతయ్యాయి. 34మంది సజీవ దహనమవ్వగా…445 మంది పరోక్ష కారణాలతో ప్రాణాలు విడిచారు.

పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం

Image courtesy: Indian Express

పాకిస్తాన్ లో మే 22న ప్రయాణికులతో కూడిన విమానం ప్రమాదానికి గురైంది. ప్రముఖ నగరం కరాచీలో అత్యంత రద్దీ ప్రాంతమైన మోడల్ కాలనీలో కూలిన విమానం మొత్తం 97 మందిని బలి తీసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 99 ప్రయాణికుల్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలని దక్కించుకున్నారు. దీంతో పాకిస్తాన్ పైలట్ల శిక్షణపై మిగిలిన దేశాల్లో అనుమానం తలెత్తింది. దాదాపు 30శాతం పైలెట్లకు అసలు అర్హత లేదని తేలింది. దీంతో 260మంది వాణిజ్య పైలట్లను పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విధుల నుంచి తప్పించింది.

భారత్ – చైనా ఢీ

లద్ధాఖ్ సరిహద్దుల్లో చైనా చేసిన ఆగడాలు భారత్ లో ప్రకంపనలు సృష్టించాయి. 2020 మే నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఊపందుకున్నాయి. డ్రాగన్ బలగాలు ఏకపక్షంగా నిబంధనల్ని ఉల్లంఘించి హద్దు దాటి దూసుకురావడంతో వ్యవహారం శృతిమించింది. ఈ క్రమంలో జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికులు తలబడ్డారు. ఆ సంఘటనలో 20మంది భారత్ సైనికులు ప్రాణాలు విడిచారు. అటు చైనా సైనికులు ఎక్కువమందే మరణించారు. అయితే ఎంతమంది అన్న విషయం ఇప్పటికీ చైనా బయటపెట్టలేదు. 1975 తర్వాత చైనా భారత్ వార్ లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఆపై ఇరు దేశాల సైన్యాలు భారీ బలగాలను మోహరించాయి. భారత్ కీలక ప్రాంతాలపై పట్టు సాధించి చైనాకు చుక్కలు చూపించింది. దీంతో చైనా చేసేదేమి లేక చర్చలకు దిగి వచ్చింది. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. చైనా ద్వేషపూరిత ఆలోచనలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా దూకుడు వల్ల ముందు ముందు వివాదం ముదిరి ప్రపంచ యుద్దానికి దారితీయోచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీరుట్ లో రక్తపు మరకలు

2020 ఆగస్టు 4న లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 204మంది మరణించారు. దాదాపు 8వేల మంది గాయపడ్డారు. 15 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. దాదాపు 3లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ పేలుళ్ల శబ్ధం 20కిలో మీటర్ల దూరంలో ఉన్న సిప్రస్ లోనూ వినిపించింది. అమెరికాలో ఈ పేలుడు ప్రకంపనల తీవ్రత రిక్టారు స్కేలుపై 3.3గా నమోదైంది. బీరుట్ ఓడరేవు సమీపంలోని ఓ భవనంలో నిల్వఉంచిన 1.1కిలో టన్నుల అమ్మోనియా నైట్రేట్ ను సరిగా చూసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రకటించారు. అయితే ఇంకా విచారణ జరుగుతూనే ఉంది.

అమెరికా ప్రజాఉద్యమం

Image courtesy: Pri org

శ్వేతజాతీయుడైన ఓ పోలీసు అహంకారానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం అమెరికాలో కల్లోలాన్ని కలిగించింది. బ్లాక్స్ లైవ్స్ మ్యాటర్ పేరుతో పెద్ద ఉద్యమమే బయల్దేరింది. ఆందోళనకారులు ఏకంగా వైట్ హౌస్ చెంతనే నిరసన వ్యక్తం చేసారు. వాషింగ్టన్ వీధుల్లో ఈ ఉద్యమం కొన్ని నెలల పాటూ కొనసాగింది. కీలక అధికారుల భవంతులపై ఉద్యమకారులు రాళ్లు రువ్వడం పెద్ద చర్చకు దారితీసింది. ఫెడరల్ బలగాల్ని రంగంలోకి దింపి ఆగ్నికి ఆజ్యం పోసాడు అమెరికా అధ్యక్షుడు. ఓ దశలో నిరసనకారుల ఆందోళనలకు అధ్యక్షుడు బంకర్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తెంది. ఆ తర్వాత అమెరికా ఆధ్యక్ష ఎన్నికలపై ఈ ఘటన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ట్రంప్ ఓటమికి ఇదే ప్రధాన కారణమై మిగిలింది.

ఏలియన్స్ ఉన్నాయన్నది నిజం

Image courtesy: Forbes

2020లో గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతుచిక్కని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కు సంబంధించి నేవీ పైలెట్లు చిత్రీకరించిన వీడియోల్ని పెంటగాన్ ఏప్రిల్ లో విడుదల చేసింది. ఇక ఇటీవల నిజంగానే ఏలియన్స్ ఉన్నాయని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు… ఇజ్రాయెల్ ఏజెన్సీ చీఫ్. దీనికి సంబంధించిన సమాచారమంతా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు తెలుసని బాంబ్ పేల్చారు.

ఫుట్ బాల్ దిగ్గజం కన్నుమూత

2020 నవంబరు 25న కన్నుమూసారు ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా. అద్భుత ఆటతో ప్రపంచ ఫుట్ బాల్ ను సుసంపన్నం చేసిన ఈ గ్రేట్ ప్లేయర్ హార్ట అటాక్ తో కన్నుమూసాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచ కప్ అందించిన డీగో..కొకైన్ వాడకం, తీవ్ర ఊబకాయ సమస్యతో అనేక ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చివరికి కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచి దివికేగాడు.