గ్లాడియేటర్, ఎక్స్ మెన్ వంటి హాలీవుడ్ చిత్రాల యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ రంగంలోకి దిగారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో సందడి చేస్తున్నారు. నిక్ పర్యవేక్షణలో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ నిర్విరామంగా జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్ కలిసిచేస్తోన్న ఈ పోరాటం కోసం 40మంది అమెరికన్ ఫైటర్స్ ను తీసుకొచ్చారు. అయితే ఈ హీరోల కాంబినేషన్ సీన్స్ దాదాపు గత వారాల్లోనే పూర్తయ్యాయి. కాగా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వారితో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. వారి సన్నివేషాల చిత్రీకరణ అయిపోగానే చెర్రీ, యంగ్ టైగర్ బరిలోకి దిగనున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకున్న విషయం తెలసిందే. ఈమధ్యే రాజమౌళి సైతం వీరులిద్దరూ కలిసి పోరాటాన్ని చేసే సమయం ఆసన్నమైందని ఓ ఫోటోను రిలీజ్ చేసారు. మరి జక్కన్న ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్న అత్యంత బీభత్స యుద్ధ సన్నివేశాల్లో పాల్గొనాలంటే అంతకుమించిన కఠినమైన కసరత్తులు చేయాల్సిందే. ప్రస్తుతం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ అదే పనిలో ఉన్నారు. యుద్ధానికి కాస్త బ్రేక్ ఇచ్చి పోరాట సన్నివేశాల గురించి మాట్లాడుకుంటూ చిల్ అవుతున్నారు. సెట్లో సందడి చేస్తున్నారు. ఆ ఫోటోలే ఇప్పుడు వైరల్ గా మారాయి.

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తోన్న భారీ మల్టీస్టారర్‌ ప్యాన్ ఇండియన్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). కొమురం భీమ్‌ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ కనిపించనున్నారు. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రీయ వంటి వారు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.