కరోనా మరోసారి బుసలు కొడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెంట్ లాక్ డౌన్ వంటివి అమలవుతున్నాయి. కేసులు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో జనాలను కంట్రోల్ చేసే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్లీ షాక్ తగిలింది. పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలంటే మళ్లీ భయం మొదలైంది. దీంతో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించిన మేకర్స్ పునరాలోచనలో పడుతున్నారు.

ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ వాయిదాపడింది. కరోనా తీవ్రత తగ్గాక ఎప్పుడు థియేటర్స్ కి వచ్చేది చెప్తామన్నారు నిర్మాతలు. వకీల్ సాబ్ దూసుకుపోతున్నా…రేపు ఎలా ఉంటుందో అన్న భయం దర్శకనిర్మాతలపై పడింది. అందుకే టక్ జగదీష్, విరాటపర్వం, ఆచార్య వంటి సినిమాల రిలీజ్ డేట్స్ కూడా మారే ఛాన్స్ ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సైతం ఆగస్టులో రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో హడావుడీగా పనిచేయడం కంటే డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ డేట్ పెట్టుకుంటే నెమ్మదిగా పనిచేస్తూ…ప్రమోషన్స్ కూడా హెవీగా చేసుకునే వీలుంటుందని భావిస్తున్నారట సుకుమార్. అందుకే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పుష్పరాజ్ టీజర్ లో రిలీజ్ డేట్ చూపించలేదు.

పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాధేశ్యామ్, కేజీఎఫ్ 2, మేజర్ వంటి సినిమాలు పునరాలోచనలో ఉన్నాయి. ఎందుకంటే అక్షయ్ కుమార్ సూర్యవంశీ, సల్మాన్ ఖాన్ రాధే వంటి సినిమాలకే తిప్పలు తప్పట్లేదు. పైగా ఓవర్సీస్ బిజినెస్ కూడా ఆశాజనకంగా లేదు. మాస్టర్, జాతిరత్నాలు మాత్రమే ఓవర్సీస్ లో బిజినెస్ చేసాయి. ఉప్పెన యూఎస్ఏలో పర్వాలేదనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న రోజే సినిమాను తీసుకురావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు దర్శకనిర్మాతలు.