ఆహాచిత్రం వ్యూయర్స్ అందరికీ భోగభాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతంటే… పాడిపంటలు-భోగి మంటలు, భోగి పళ్లు-పిండి వంటలు, హరిదాసు భజనలు- రివ్వున ఎగిరే గాలిపటాలు, కోడి పందాలు-కొత్త సినిమాలు. సంక్రాంతిపండగంటే సరదాలు మొదలయ్యేది భోగితోనే. ఎర్ర ఎర్రని మంటలు.. ఎరుపెక్కిన సూర్య కిరణాలు.. అల్లా నేరెళ్ళు.. అటుకులు బెల్లం… పసుపు చందనాలు.. పడచుల ఆటలు, పాత కర్రల మంటలు.. చిన్నారి నెత్తి మీద బోగి పళ్ళ నాట్యాలు. ఇట్లా పోద్దున్నే లేచిన పల్లె మూడు పొద్దులు పోయేవరకు.. సద్దు మనగదు.

భోగి తర్వాత వచ్చేదే.. మకర సంక్రాంతి…’ పెద్ద పండుగ’. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక దీనిని మకర సంక్రమణం అనీ అంటారు. ప్రకృతిని ఆరాధించి సూర్యభగవానుని వేడుకునే అసలైన పండుగే…సంక్రాంతి. కొత్త బట్టలు వేసుకుని దైవ పూజచేస్తారు ప్రతి ఒక్కరు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి ఒకే చోట పండగని సెలబ్రేట్ చేసుకుంటారు.
కనుమ, ముక్కనుమనాడు ముక్కలేనిదే ముక్క దిగదు కొంతమందికి. కొత్త అల్లుళ్లకు రకరకాల నాన్ వెజ్ వంటకాలను వడ్డించి అత్తగారింటి రుచులను పరిచయం చేస్తారు. కూతురు, అల్లుళ్లకు నూతన వస్త్రాలు, కానుకలు అందించి సంబరపడతారు తల్లిదండ్రులు. ఇదంతా ఓసారైన చూసి తీరాల్సిన ముచ్చట.

పొద్దుపొద్దునే ఆడపడుచులు వేసే రంగురంగులు… చక్కగా చీరకట్టుకుని అందంగా అలంకరించుకుని… ఆ ముగ్గులలో గొబ్బెమలను పెట్టి.. వాటి చూట్టూ ఆడే ఆటలు.. అవన్నీ చూడటానికి రెండు కళ్ళు చాలవు.. రంగుల ముగ్గుల చుట్టూ చక్కని చుక్కలు నాట్యమాడుతున్నట్టు ఉంటుంది.. పండుగ అంటేనే వెలుగు.. ఆ వెలుగులకు రంగులద్దినట్టుంది సంక్రాంతి పండుగ..

భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు ఒక్క కుటుంబానికి సంబంధించిన పండుగలు కాదు.. ఒక ఊరికి సంబంధించిన పండుగలు.. పంటచేల బిడ్డల పండుగ.. బోగి పండ్లు పోసుకునే చిన్నారుల పండుగ.. వీధి వీధిన వాడ వాడలా.. మగువలు సందడి చేసే పండుగ.. ఇది అందరి పండుగ..
ఊరూర సంక్రాంతి సందడి.. గుమ్మాలకు పచ్చ తోరణాలు.. గడపకు పసుపు పూతలు… అరిసెలు పాయసాలు… సకినాలు సర్వపిండి వంటలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో మరెన్నో.. అంతేనా బావా వరదళ్ళ సందళ్లు.. సరసాలు.. ఆటలు పాటలు.. సంక్రాంతి అంటేనే సందడి, సందడి అంటేనే సంక్రాంతి..

చుట్టాలతో ప్రతి ఇళ్లు కళకళలాడుతుంది సంక్రాంతికి.. ఇంటి ఆడపడుచులను పిలుచుకుని.. అల్లుళ్లకు మార్యాదలు చేసి.. నూతన వస్త్రాలను అందిస్తారు.. ప్రతి ఇంట అతిధుల సందడి ఉండటంలో ఊరంత సందడి మొదలవుతుంది.. చిన్నారుల ఆట పాటలు, గాలిపటాలు, చెరకు తీపి రుచులు..కోడి పందాలు. ఇలా మూడురోజులు ఉత్సవంలా ఉంటుంది ఊరు..

సంక్రాంతి పండుగకు మరో ప్రత్యేకత ఉంది.. దక్షిణాది ఆటలైన కోడి పందేలు, ఆంధ్ర కోస్తా జిల్లాలలో ఆడగా, తమిళనాడు రాష్ట్రంలో ఎద్దుల పందేలు, కేరళలో ఏనుగుల మేళా నిర్వహిస్తారు. ఈ పందేలలో చట్టబద్ధం కానప్పటికీ అధిక మొత్తాలలో పందేలు కాయటం ఈ ప్రాంతాలలో ఆనవాయతీగా వస్తోంది. తమ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేలా సంక్రాంతి ఉత్సవాలు చేసుకుంటారు..

పండక్కి ఇంకా నెల రోజులు వుందనగానే, ప్రతి రోజూ ఉదయం హరిదాసులు, గంగిరెద్దులు ప్రతి ఇంటి ముందుకు తెచ్చి ఇంటి వారికి ఆశీర్వాదాలు ఇచ్చి సొమ్ము అడుగుతారు. ఇక హైదరాబాద్, తెలంగాణ జిల్లాలలో పిల్లలు, పెద్దలు కలసి రంగు రంగుల గాలి పటాలు ఎగరేసి ఆనందిస్తారు. మనతో పాటు, పొరుగున రాష్ట్రలైన కర్నాటక, తమిళనాడు ప్రజలు ఈ పండుగను పొంగల్ పేరుతో జరుపుకుంటారు.
కొత్త కుండల్లో కొత్త పంటలను వేసి పూజించడం మహారాష్ట్రవాసుల సంప్రదాయం. ఇక పెద్ద ఎత్తున గాలిపటాలెగరేసి పండుగ చేసుకుంటారు గుజరాత్ ప్రజలు. పంజాబీలు లోహ్రీ అంటే…అస్సామీలు బిహూ అంటారు. బెంగాళీలు గంగమ్మ సాగరసంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.