ఇప్పుడు జాంబిరెడ్డి ట్రైలర్ చూస్తుంటే గుర్తొస్తుంది. ఎప్పుడో 2012లో ‘బస్ స్టాప్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆనంది…మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు తెరపై కనిపించబోతున్నారు. జాంబిరెడ్డి చిత్రంతో తెలుగమ్మాయి…తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తెలుగమ్మాయి…తెలంగాణ అమ్మాయి…వరంగల్ అమ్మాయికి తెలుగులోనే అవకాశాలు దొరకలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీని నమ్ముకున్నారు. అందుకు తగ్గట్టే అక్కడ అడపదడపా సినిమాలు చేస్తూ ‘పరియేరూం పెరుమాళ్’ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మొత్తానికి ప్రశాంత్ వర్మ ద్వారా మరోసారి తెలుగువారి ముందుకు జాంబిరెడ్డి ద్వారా వస్తున్నారు. చూద్దాం ఈ సినిమాతో అయినా ఆనంది ఫేట్ మారుతుందేమో….

శ్రీదివ్య…సేమ్ ఆనంది స్టోరీనే. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ తో ఎంట్రీ ఇచ్చిన శ్రీదివ్య… ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రంతో నటిగా తానేంటో నిరూపించుకున్నారు. హీరోయిన్ గా మనసారా, బస్ స్టాప్, కేరింత సినిమాలో హీరోయిన్ గా నటించారు. అయితే ఆ తర్వాత ఎవ్వరూ శ్రీదివ్య గురించి పట్టించుకోలేదు. తమిళ్ ఇండస్ట్రీని నమ్ముకున్నారు. వరుస అవకాశాలను అందుకున్నారు. మినిమం గ్యారంటీ హీరోల సరసన సినిమాలు చేస్తూ మంచి నటిగా పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘జనగనమణ’ అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. మరి ఇప్పటికైనా టాలీవుడ్ శ్రీదివ్యను గుర్తిస్తుందా…చూడాలి.