సినీ ప‌రిశ్ర‌మ‌లో టాకీ చిత్రాలు రాకమందు మూకీ చిత్రాలు అలరించాయి. అయితే మాట్లాడే సినిమాలొచ్చాక మూకీకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. అయినా సరే కమల్ హాసన్ ఓ ప్రయోగం చేసారు. సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో పుష్పక విమానంలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మాటలే లేకుండా తీసిన మూకీ సినిమా పుష్పక విమానంతో విజయం సాధించారు కూడా. అయితే కమల్ కి ప్రయోగలంటే మహా సరదా. నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు తాపత్రయపడుతుంటారు కమల్ హాసన్. ఇప్పుడలాగే విజయ్ సేతుపతి తమిళ్ తెరపై మెరుస్తున్నారు. తాజాగా గాంధీ టాక్స్ అంటూ సైలెంట్ గా రచ్చ చేయబోతున్నారు.
రీసెంట్ గా మ‌క్క‌ల్ సెల్వ‌న్ సేతుప‌తి విజయ్ మూకీ ప్ర‌యోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజ‌య్ సేతుప‌తి నటిస్తున్నాడంటేనే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందనేంత క్రేజ్ తెచ్చుకున్నారు. రీసెంట్ మాస్టర్ కూడా విజయ్ సేతుపతి విశ్వరూపాన్ని చూపించింది. హీరోగా చిత్రాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్‌గా మెప్పిస్తన్నారు.. పాత్ర ఏదైనా త‌న స్పెషాలిటీని చాటుకుంటున్నారు. ఇప్పుడిక మాట‌లు లేని మూకీ సినిమాలో నటించేందుకు రెడీఅయ్యారు విజ‌య్ సేతుప‌తి. కిషోర్ పాండురంగ్ బేలెక‌ర్ డైరెక్షన్ లో ఈ మూకీ డ్రామా రూపొందుతుంది. గాంధీ టాక్స్ అనే టైటిల్‌తో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. బ్యాగ్రౌండ్ మొత్తం క‌రెన్సీ నోట్ల‌తో నింపేయ‌డం హైలైట్ గా మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీనిని ప్లాన్ చేసారు.