ఒక్కరోజులో సూపర్‌స్టార్‌అయిపోలేదు. సో కాల్డ్ హీరోకుండాల్సిన లక్షణాలేవీ కనిపించవు. స్టార్ అవగానే గతాన్నీ మర్చిపోలేదు. రాజబాటలో నడిచే అదృష్టం ఉన్నా…రహదారిలోనే వెళ్లాలనుకునే సాదాసీదా మనిషి. అవును ఆయనే శివాజీగా జన్మించి…రజనీకాంత్ గా ఎదిగి…తలైవా అనిపించుకుంటున్న రజనీకాంత్. భారతదేశ సినిమా అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే… రజనీని వరించడం ఇప్పుడు అభిమానులకి పండుగే.

ఆయన కెరీర్ లో ఎన్నో పురస్కారాలు…
ఆయన జీవితంలో మరెన్నో మైలురాళ్లు…
ఇప్పుడు కొత్తగా దాదా సాహేబ్ ఫాల్కే…
రజనీ అవార్డుల ముత్యాల హారంలో ఓ కలికితురాయి…దాదా సాహేబ్ ఫాల్కే. ఎస్ ఇది..రజనీకి దక్కిన అపూర్వ గౌరవమే. కానీ రజనీ అన్న మూడక్షరాల పేరు వెనకున్న స్టార్ డంతో ఏ అవార్డ్ తులతూగుతూంది. వెండితెరపై ఒక్కసారి కనిపిస్తే చాలనుకునే అభిమానుల ప్రేమతో ఏ రివార్డ్ పోటీపడుతుంది. అవును తలైవ చెంతకు ఏదీ అంత సింపుల్ గా రాలేదు. దాని వెనుకున్న కృషి, పట్టుదల చాలామందికి తెలియదు. లేకపోతే ఒక అతిసామాన్యుడు హీరోగా మారి ఇన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరించడం అంటే మాటలా…?

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రజనీని చూసినవారికి హీరో మెటీరియల్ లా అనిపించలేదు. అమ్మాయిలు కలలుగానే డ్రీమ్ బాయ్ లా ఊహించుకోనులేదు. కానీ తనని తాను మార్చుకుంటూ, హీరోగా మలుచుకుంటూ…నువ్వే మా వాడివని దర్శకనిర్మాతలు వెంటపడేలా ఎదిగారు. ఆయన స్ట్రైలే సినిమాకు స్టామినా అని గుర్తించేలా చేసారు. ప్రొడ్యూసర్స్ పాలిట కాసులవర్షం కురిపించారు. బస్సులో ఈల వేసిన కండక్టర్ శివాజీ…తనకోసం ఈలలు వేయించుకున్న మాస్ హీరోగా ఎదిగిన క్రమం..ఓ లెజండరీ ప్రయాణం. నేటితరానికి ఆదర్శం.

మహారాష్ట్ర సొంత ప్రాంతమైనా కర్ణాటక, బెంగుళూరులో రామోజీరావ్ గైక్వాడ్, రామాబాయి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు శివాజీరావ్ గైక్వాడ్ అన్న పేరుపెట్టుకున్నారు. తండ్రి పోలీసు కానిస్టేబుల్‌. తొమ్మిదేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో చిన్నతనం నుంచే కష్టాలు అనుభవించారు. ప్రాథమిక విద్యతో పాటూ రామకృష్ణ మిషన్ లో వేదాలు నేర్చుకున్నారు. ఆ మఠంలోనే మహాభారతం వంటి నాటకాల్లో చురుకుగా పాల్గొనేవారు. పొట్టకూటి కోసం 1966 నుంచి 1973 వరకు ఎన్నో చిన్నచితకా పనులు చేసుకుంటూ గడిపారు. కూలీ పనులకు కూడా వెనుకాడలేదు. చివరకు బస్సు కండక్టర్‌గా దొరికిన ఉద్యోగమే శివాజీ లైఫ్ ని మలుపుతిప్పింది.

చిన్నతనం నుంచే నాటకాలన్నా, సినిమాలన్నా రజినీకి పిచ్చి. ఆయన వేసిన ప్రతీ నాటకంలో తన సేపరేట్ స్టైల్ చూపించేవారు. అందరు కండక్టర్స్ లా ఉంటే రజనీ ఎలా అవుతారు..చేస్తున్న ఉద్యోగం కూడా స్టైలిష్ గా చేసేవారు. నాటకాల్లో అద్భుత నటన ప్రదర్శిస్తున్న శివాజీని స్నేహితుడు రాజ్‌బహదూర్‌ప్రోత్సహించారు. ఎలా అయినా నటుడిగా నీ అదృష్టాన్ని పరీక్షించుకొమ్మని డబ్బులిచ్చి మరీ మద్రాసుకు పంపించాడు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో డైరెక్టర్ కె.బాలచందర్‌దృష్టిలో పడ్డారు. శివాజీ అన్న పేరును రజినీకాంత్ గా మార్చి… తమిళ్ భాషను త్వరగా నేర్చుకోమ్మని చెప్పి… తన అపూర్వ రాగంగళ్ సినిమాలో అవకాశం ఇచ్చి రజనీ జీవితానికి గాడ్ ఫాదర్ అయ్యారు బాలచందర్.

రజనీకాంత్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే టైంకే కమల్ హాసన్ ఓ స్టార్. గురువు బాలచందర్ సలహా ప్రకారం కమల్ హాసన్ నటనను కొన్నిరోజులు గమనించారు. కానీ అనుకరించలేదు. కమల్ లా చేస్తే రజనీని ఎలా అవుతానని తన మేనరిజమ్స్ చూపించారు. అందుకే ‘పదినారు వయదినిలె’ హీరో కమల్ కన్నా…విలన్ పాత్ర చేసిన రజినీకి చప్పట్లు కొట్టారు జనం. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నాలుగు సంవత్సరాల్లో 50సినిమాలు పూర్తిచేసేసారు. 80ల్లో బిల్లాతో బ్లాక్ బస్టర్ కొట్టి కమల్ ని వెనక్కినెట్టేసారు.

ఆయనకు మాత్రమే సొంతమైన….తను మాత్రమే చేయగల యాక్టింగ్ స్కిల్స్ తో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ చెలరేగిపోయారు. తన మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ‘భైరవి’ రజనీ పేరుకు ముందు ‘సూపర్‌స్టార్‌’ ని తీసుకొచ్చింది.
తమిళ్ రంగంలో ఫుల్ బిజీగా మారినా…తెలుగులో అడపదడపా బాలచందర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తుండేవారు. అంతులేని కథతో తెలుగులో పరిచయమైనా…చిలకమ్మ చెప్పిందితో హీరోగా మారాడు. టైగర్, రామ్ రహీమ్ రాబర్ట్, ఇద్దరూ అసాధ్యులే, కాళి వంటి స్టైయిట్ తెలుగు సినిమాలతో పాటూ తమిళ్ డబ్బింగ్ చిత్రాలతో ఎనలేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

దళపతి, ముత్తు, భాషా, పెదరాయుడు…ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులతో కూడా విజిల్స్ వేయించుకున్నారు. సూపర్ స్టార్ మూవీ అంటే థియేటర్స్ దద్దరిల్లేలా మార్చేసారు.
అరుణాచలం, నరసింహా సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిపారేసారు. చంద్రముఖి, రోబో, కబాలి వంటి సినిమాలతో సలాం రజనీ అని ఇప్పటికీ తన లేటెస్ట్ మూవీ అన్నాత్తే కోసం ఎదురుచూసేలా చేస్తున్నారు.

రజనీ అంటే కేవలం సినిమా కాదు…ఆయన స్టైల్ సినిమాల్లోనే సేపరేట్ కాదు. నిజజీవితంలోనూ తలైవా చాలా డిఫరెంట్. స్నేహం, ఆధ్యాత్మికత, నిరాండబరత, అభిమానులపై చూపించే ప్రేమ అన్నింట్లోనూ సూపర్ స్టార్ అంటే స్పెషల్. అందుకే దాదా సాహేబ్ ఫాల్కే అందుకున్న వేళ అటు సినీప్రపంచంతో పాటూ ఇటు ప్రేక్షకలోకం ఆనందంలో మునిగింది.

తనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన లత అనే అమ్మాయిని ప్రేమించి…పెళ్లాడారు రజనీకాంత్. సినిమాలకెంత ప్రాధాన్యత ఇస్తారో ఫ్యామిలితోనూ అంతే సంతోషంగా గడుపుతారు. వారి మాటలకు విలువనిస్తారు. ప్రజలకోసం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇద్దామనేది రజనీకాంత్ చిరకాల స్వప్నం. అభిమానులు కోరుకున్న ప్రకారం రాజకీయాల్లోకి వచ్చేందుకు చాలాసార్లు ప్లాన్ చేసారు. అప్పుడా, ఇప్పుడా అంటూ సాగిన పొలిటికల్ చర్చకు తెరదీస్తూ ఇదిగో నేనొస్తున్నానని 2020 చివర్లో ప్రకటించారు. కానీ అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన తలైవా…ఆరోగ్యం సహకరించక ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడే తన కూతుర్ల మాటలకు విలువనిచ్చి రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పారు. ఎంట్రీ అనగానే ఎగిరిగంతేసిన అభిమానులు…బైబై చెప్పగానే ఒప్పుకోలేదు. కానీ తన మాటలతో ఫ్యాన్స్ ని ఒప్పించి…నటుడిగానే ఆదరించమని లెటర్ రిలీజ్ చేసారు.

అభిమానులకెప్పుడూ చేరువలోనే ఉంటారు రజనీకాంత్. నేను స్టార్ అన్న అహాన్ని ప్రదర్శించరు. అందుకే పొలిటికల్ ఎంట్రీ అనగానే ఫ్యాన్స్ మురిసిపోయారు. అయినా రజనీకి కనపడకుండా ప్రజాసేవ చేయడం అలవాటు. దానగుణం ఆయనది. తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన ‘రాఘవేంద్ర పబ్లిక్‌ చారిటీ ట్రస్టు’కే వెళ్లిపోతుందని రజనీ గతంలో బహిరంగంగా ప్రకటించారు. ‘రజనీకాంత్‌ కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే విషయమే అందరికీ తెలుసు. కానీ ఆయన సంపాదనలో 50 శాతాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చుపెడతారన్న సంగతి చాలామందికి తెలీదు’ అని రజనీకాంత్‌జీవిత చరిత్రలో రచయిత నమన్‌రామచంద్రన్‌ప్రస్తావించారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా పారితోషకాన్ని ఇచ్చేసే అలవాటు రజనీకుంది. అందుకే ఆయనపై ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనుకాడరు దర్శకనిర్మాతలు.

రజనీ సూపర్‌స్టార్‌అయినా తన పాత స్నేహితులను మర్చిపోలేదు. ఏడాదికోసారి రజనీకి బెంగళూరులోని స్నేహితుడి ఇంటికెళ్లి ఐదారు రోజులు గడిపి రావడం అలవాటు. అలాగే ఇటు ఇండస్ట్రలోనూ ఆయనకు శత్రువులు లేరు. అన్ని భాషల ఇండస్ట్రీలోనూ రజీనికీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక రజినీ ఆధ్యాత్మికత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు తనకు సినీజీవితాన్ని ఇచ్చింది కూడా దైవమే అని బలంగా నమ్ముతారు. వెళ్లాలనుకున్నప్పుడు హిమాలయాలకు వెళ్తారు. ఆలయాలను సందర్శిస్తారు. సాధారణ వ్యక్తిలా దేశమంతా చుట్టొస్తారు. ఇలా ఒక్క సినిమా ప్రపంచంలోనే కాదు…తనకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొని ఆనందంగా గడుపుతున్న తలైవా రజనీకాంత్ అంటేనే…ఓ సూపర్ పవర్. ఆయన్ను దాదా సాహెబ్ ఫాల్కే ఆవార్డ్ వరించడం…అందరూ ఆనందించతగ్గ విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *